Monday, September 26, 2011

వ్యతిరేకతకు కారణాలు

కూడన్ కుళం అను విద్యుత్ కేంద్రం

కూడన్ కుళం అణు విద్యుత్ కేంద్రానికి స్థానికుల నుంచి ఒక్కసారిగా నిరసనలు వ్యక్తం కావటానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణ సమయం నుంచి చోటుచేసుకున్న ఒక్కొక్క పరిణామం ప్రజల మదిలో భీతిని గూడు కట్టించింది. అందుకనే ఫుకుశిమ అణు విద్యుత్ కేంద్రం ప్రమాదంతో తమ మనసులో గూడు కట్టుకున్న భయాందోళనలు ఒక్కసారిగా బహిర్గతం చేశారు. వాటిని పరిశీలిస్తే...

ఇవి ప్రజల్లోని భీతి

1. కూడన్ కుళం అణు విద్యుత్ కేంద్రం సరిగ్గా సముద్ర తీరం వెంబడి నేలకోనతంతో సునామి, భూకంపం వంటి వైపరీత్యాలు సంభవిస్తే అణు రియాక్టర్లు దెబ్బతిని పేలిపోయే అవకాశం ఉందని, అలాగా జరిగితే పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది ప్రాణాలకే ముప్పు.

2 . అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసే పరిసర ప్రాంతాల్లో 16 కిలోమీటర్ల పరిధిలో జన సాంద్రత చాలా తక్కువగా ఉండాలి. అప్పుడే అణు విద్యుత్ కేంద్రంలో ఏదయినా విపత్తు ఏర్పడితే పరిసర ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేర్చవచ్చు. అయితే కూడంకుళం పరిసర ప్రాంతాల్లో అధిక జన సాంద్రత ఉంది. 16 కిలోమీటర్ల పరిధిలో పదివేల మంది, 30 కిలోమీటర్ల పరిధిలో పది లక్షల మంది ఉన్నారు. దీంతో ఏదయినా విపత్తు ఏర్పడితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయటం దుర్లభంగా మారుతుంది. ఫలితంగా అధిక ప్రాణ నష్టం ఏర్పడుతుంది.

3 . అణు విద్యుత్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో రాళ్ళ క్వారీలు ఉంటే అక్కడ రాళ్ళ తొలగింపు సందర్భంగా చోటుచేసుకొనే పేలుళ్ళ వల్ల అణు రియాక్టర్లు దెబ్బతింటాయి. దీంతో అణు విద్యుత్ కేంద్రాల పరిసరాల్లో రాళ్ళ క్వారీలు కొనసాగటం నిషేధం. అయితే అణు విద్యుత్ కేంద్రానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో, ఇడిందకరై సమీపంలో ఓ రాళ్ళ క్వారీ కొనసాగుతున్నట్టు గుర్తించారు. ఈ నిమిత్తం హైకోర్టు మదురై బెంచ్ లో ఓ పిటిషన్ దాఖలు చెయ్యగా దానిపై రెండు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని గతంలో తిరునెల్వేలి కలెక్టరుని ఆదేశించింది.

4 . అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ ప్రభావంతో ప్రజలు దీర్ఘ కాలిక రోగాలకు గురి అవుతారు. సముద్ర జలాలపైన కూడా రేడియేషన్ ప్రభావం పడటంతో సముద్రంలోని జలచరాలు అంతరించిపోతాయి. దీంతో తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో చేపల వేట ప్రధానంగా ఉన్న జాలర్లు తమ జీవనోపాధి కోల్పోతారు. కూడన్ కుళం అణు విద్యుత్ కేంద్రానికి సమీపంలోని సముద్రంలో అయిదు కిలోమీటర్ల దూరం వరకు చేపలవేట నిషేదించడం ఇందుకు నిదర్శనంగా చూపిస్తున్నారు.

5 . అణు విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో నాసి రకమైన సముద్రపు ఇసుక వాడారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే అప్పావు జిల్లా కలెక్టరుకు కూడా ఫిర్యాదు చేశారు. ఇది అణు విద్యుత్ కేంద్రం నిర్మాణ సుస్థిరతపై అనుమానాలు రేకెత్తించింది. ఈ పరిణామాలు ప్రజల్లో ఆందోళనలు కలిగించింది.

6 . అణు విద్యుత్ కేంద్రం పరిధిలోని రెండు కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి కట్టడాలు ఉండకూడదు అని, రెండు కిలోమీటర్ల నుంచి అయిదు కిలోమీటర్ల దూరాన్ని స్టెరిలైజ్డ్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు 1991 ఏప్రిల్ 29  వ తేది ప్రజా పనుల శాఖ విధాల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు నంబరు 828 పేర్కొంది. దీంతో ఆ పరిధిలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటుకు అనుమతి లభించదు. దీంతో కూడన్ కుళం పరిసర ప్రాంతాల ప్రజలకు భవిష్యత్తులో కొత్తగా ఉపాధి అవకాశాలు లభించవు.

7 . వినాశనం సృష్టించేందుకు తీవ్రవాదుల తొలి లక్ష్యం అణు విద్యుత్ కేంద్రాలుగా ఉన్నాయని తరచు వార్తలు రావటంతో ప్రజలు కూడా భీతి చెందుతున్నారు.

No comments: