Monday, September 26, 2011

కూడన్ కుళం అణు విద్యుత్ కేంద్రం

కూడన్ కుళం అణు విద్యుత్ కేంద్రం 
మిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో కూడన్ కుళం అణు విద్యుత్ కేంద్రం నెలకొంది. కూడన్ కుళం గ్రామంలోని సముద్ర తీరం వెంబడి ఈ ప్రాజెక్ట్ పనులు చేపట్టడంతో దీనికి కూడన్ కుళం అణు విద్యుత్ కేంద్రం అనే పేరు వచ్చింది. 1988 వ ఏడాది రష్యా సహకారంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు భారత న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ శ్రీకారం చుట్టింది. ఈ నిమిత్తం అదే ఏడాది నవంబరు 20 వ తేది అప్పటి రష్యా ప్రధానమంత్రి మైఖేల్ గోర్బచేవ్, భారత ప్రధాని  రాజీవ్ గాంధి ఒప్పంద పత్రాలపైన సంతకాలు కూడా చేశారు. ఈ ఒప్పందానికి రెండేళ్ళ కిందటే చెర్నోబిల్ దేశంలోని అణు విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న భారీ ప్రమాదంతో వేలాదిమంది మృత్యువాత పడటంతో ఈ ప్రాజెక్ట్ కి అప్పట్లో పర్యావరణ ప్రియుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అయితే తిరునెల్వేలి జిల్లలో కరవు, నిరుద్యోగ సమస్యలు తండవించడంతో ఉపాధి అవకాశాలపై ఆశతో ప్రజలు మాత్రం వ్యతిరేకించలేదు. అయినా ఆ ప్రాజెక్ట్ కు బాలారిష్టాలు తప్పలేదు. అప్పటి రష్యా రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రాజెక్ట్ పనులు కార్యాచరణకు నోచుకోలేదు. అప్పట్లో సోవియట్ యూనియన్ గా ఉన్న రష్యా  తర్వాత పలు దేశాలుగా విడిపోవటంతో 1991 వ ఏడాది వరకు, ఆ తర్వాత న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (NSG) అనుమతులు లేవనే కారణం చూపిస్తూ 1992 వ ఏడాది  నుంచి అమెరికా ఆక్షేపణలతో ప్రాజెక్ట్ పనులు దస్త్రాలకు మాత్రమే పరిమితం అయ్యాయి.

13 ఏళ్ల విరామం తర్వాత... 

ట్టకేలకు 2001 వ ఏడాది కూడన్ కుళం అణు విద్యుత్ కేంద్రం ప్రాజెక్ట్ పనులకు క్రియాశీల ఒప్పందం  కుదిరింది. అప్పటికే అక్కడ  భూముల సేకరణ చేపట్టగా బాలారిష్టాలను అధిగమించి నిర్మాణ పనులు ప్రారంభించారు. అణు విద్యుత్ కేంద్రానికి కావలసిన అణు రియాక్టరు పరికరాలను తూత్తుకుడి నౌకా దళానికి నౌకల ద్వారా తరలించి అక్కడి నుంచి భారీ కంటైనర్ల ద్వారా కూడన్ కుళానికి తరలించారు. అయితే రోడ్డు మార్గం నుంచి తరలిచే సమయాల్లో రోడ్ల ధాటికి పలు పరికరాలు దెబ్బ తిన్నాయి. దీంతో నిర్మాణ ప్రాంతానికే పరికరాలను సముద్ర మార్గంగా రవాణా చేయాలని, ఇందుకుగాను కూడన్ కుళంలోనే మినీ హార్బర్ ఏర్పాటు చెయ్యాలని సంకల్పించారు. దక్షిణాగ్రంలో  అణు విద్యుత్ ఏర్పాటుతో భద్రత దృష్ట్యా కూడా ఇక్కడ మినీ హార్బర్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో కూడన్ కుళంలోనే మినీ హార్బర్ ఏర్పాటు చెయ్యడంతో 2004  జనవరి 14  వ తేది నుంచి అణు విద్యుత్ కేంద్రం పరికరాలు ఈ హార్బరు ద్వారా ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి చేరవేశారు. మొదట ఇక్కడ WER 1200 రకానికి చెందిన 1000 మెగావాట్ల (1 GW) సామర్థ్యం కలిగిన తొలి తరం రియాక్తర్లతో రెండు యూనిట్లు నెలకొల్పారు. వీటిని న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL), రష్యాకు చెందిన ఆటంస్ట్రాయ్  ఎక్స్ పోర్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇవి పని చెయ్యటం ప్రారంభిస్తే దేశంలోని అతిపెద్ద విద్యుదుత్పాదక కేంద్రం ఇదే.  అలాగే అదనంగా 1170 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన నాలుగో తరానికి చెందిన WER 1200 రియాక్టర్లు మరో నాలుగు అందించేందుకు కూడా రష్యా అంగీకరించింది. ఈ మేరకు 2008 డిసెంబరులో ఒప్పందం కూడా కుదిరింది. 

ఫుకుశిమ ప్రమాదంతో వెల్లువెత్తిన వ్యతిరేకత

నిరవధిక దీక్షలో...
 పాన్ దేశంలో 2011 ఆగస్ట్19 వ తేది ఏర్పడిన భూకంపంతో ఫుకుశిమాలోని అణు రియాక్టర్లు దెబ్బతిన్న ఘటన ప్రపంచ  వ్యాప్తంగా ఉన్న అణు రియాక్టర్ల  భద్రత వ్యవహారంపై భీతిని  సృష్టించింది. కూడన్ కుళం అణు     విద్యుత్ కేంద్రం ప్రాజెక్ట్ విషయంలో జిల్లా వాసులతో పాటు పొరుగు జిల్లాలైన తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లా వాసుల్లో కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 2004  డిసెంబరు 26 వ తేది సునామి సంభవించిన నేపద్యంలో భవిష్యత్తులో మళ్ళీ సునామి, భూకంపాలు వింటివి ఏర్పడితే తమకు ముప్పు తప్పదని భయాందోళనలకు గురైయ్యారు. దీంతో ఒక్కసారిగా నిరసనలు తెరపైకి వచ్చాయి. దీనికి సామాజిక వేత్తలు, పర్యావరణ ప్రియుల మద్దతు కూడా తోడైయ్యింది. దీంతో కూడన్ కుళం ప్రాజెక్ట్ నిలిపివేత నినాదంతో కూడన్ కుళం విద్యుత్ కేంద్రం వద్ద సెప్టెంబరు 11 వ తేది ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.అందుకు పోలీసు శాఖ నుంచి అనుమతి లభించలేదు. దీంతో వేదిక మార్చి అదే రోజున కూడన్ కుళం సమీపంలోని ఇడిందకరై గ్రామమానికి మార్చారు. దీక్షకు మద్దతు సేకరించేందుకు ప్రచారాలు కూడా చేపట్టారు. వాల్ పోస్టర్లు, కర పత్రాలు సైతం ముద్రించి తమ నిరాహార దీక్షకు రాష్ట్ర ప్రజల నుంచి మద్దతు కోరారు. ఇదిండకరైలోని సెయింట్ లూర్తు చర్చి వద్ద దీక్షకు భారీ పందిరి కూడా ఏర్పాటు చేశారు. దీంతో తొలి రోజు దీఖకు పదివేలకు పైబడిన జనాభా తరలిరావడంతో దీక్ష ఉధృతంగా కనిపించింది. దీక్షలో 20 మంది మహిళలు, నలుగురు వికలాంగులు, ముగ్గురు కన్య స్త్రీలతో సహా  127 మంది నిరవధిక దీక్ష చేశారు. కూడన్ కుళం అణు విద్యుత్ కేంద్రంపైన వ్యతిరేకతకు మరిన్ని కారణాలు ఉన్నాయి.
దీక్షకు మద్దతు వెల్లువ

దీక్షలోని మహిళలతో మాట్లాడుతున్న మేథా పాట్కర్
డిందకరైలో చేపట్టిన దీక్షలకు ప్రతీ రోజు ప్రజలు నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. దీనికి తోడు ప్రముఖ ఉద్యమకారులు, రాజకీయ నేతలు నుంచి సంఘీభావం వ్యక్తమయ్యింది. తొలి రోజు దీక్షలో స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ రాయప్పన్ (ఎం.డీ.ఎం.కే) పాల్గొని తమ పార్టీ తరపున దీక్షకు సంఘీభావం తెలిపారు. 12 వ తేది జరిగిన దీక్షలో ఎం.డీ.ఎం.కే ప్రధాన కార్యదర్శి వైగో, మత గురువు బాల ప్రజాపతి అడిగళారు పాల్గొన్నారు. 13 వ తేది దీక్షలో తమిళనాడు వ్యాపారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వెల్లైయన్ పాల్గొని దీక్షకు మద్దతుగా సెప్టెంబరు 20 వ తేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు, తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారిలో పూర్తి స్థాయి బంద్ పాటిస్తామని తెలిపారు. 15 వ తేది జరిగిన దీక్ష సందర్భంగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జయలలిత ఓ ప్రకటన విడుదల చేశారు. సునామి, భూకంపాలను తట్టుకొనే విధంగా కూడన్ కుళం అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేశారని ఆ ప్రకటనలో తెలిపారు. అయినా ప్రజల వైఖరిలో 
దీక్షలో ప్రసంగిస్తున్న వైగో
లేకపోవటంతో తర్వాతి రోజైన 16 వ తేది  కూడా దీక్ష ఉధృతంగా కొనసాగింది. ఆ రోజు దీక్షకు మద్దతుగా కన్యాకుమారి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో జిల్లాలోని విద్యా సంస్థలు మూతపడ్డాయి. కన్యాకుమారి లోక్ సభ సభ్యుడు హెలెన్ డేవిడ్ సన్ ఇంటిని ముట్టడించడంతో పాటు ఆ జిల్లా కలెక్టరేట్ ను కూడా ముట్టడించారు. తూత్తుకుడి, కన్యాకుమారి చెన్నై జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. అదే రోజు దీక్షలో పాల్గొన్న నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో వారిలో కూడన్ కుళానికి చెందిన ఏ.గణేషన్ (40), ఇడిందకరైక్కు చెందిన ఎఫ్.నావిసన్ లియోని నాగర్ కోవిల్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో, ఇడిందకరైక్కు చెందిన ఎస్.ప్రశాంత్ బి.పూర్ణం (42)ని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు దీక్షలో పాల్గొన్న వారిని పీ.ఎం.కే  అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీకే మణి కలిసి దీక్షకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. 17 వ తేది దీక్షలో నిరవధిక దీక్ష చేపట్టిన వారిలో 24  మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. దీక్షకు మద్దతుగా, ప్రభుత్వానికి నిరసన తెలిపే విధంగా ఇడిందకరై  
దీక్షను చూస్తున్న విజయకాంత్ 
పరిసర గ్రామాల్లో పలు చోట్ల గంజి కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యా సంస్థలు, దుకాణాలు బంద్ అయ్యాయి. 18 వ తేది ప్రతిపక్ష నేత, డీ.ఎం.డీ.కే అధ్యక్షుడు విజయకాంత్, 19 వ తేది ప్రముఖ సామాజిక వేత్త మేథా పాట్కర్ దీక్షలో పాల్గొన్న ప్రజలను పరామర్శించి తమ మద్దతు తెలిపారు. 19 వ తేది దీక్ష సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు ముఖ్యమంత్రి జయలలిత రాసిన ఓ అత్యవసర లేఖలో ఇన్ని రోజులుగా దీక్ష జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ కూడన్ కుళం రాలేదని గుర్తు చేశారు. కూడన్ కుళం అణు విద్యుత్ కేంద్రం వ్యహారంలో స్థిమిత పరిస్థితి ఏర్పడే వరకు ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. ఈ వ్యవహారం నిమిత్తం రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఓ.పన్నీర్ సెల్వం నేతృత్వంలో అఖిలపక్ష నేతలు ప్రధాన మంత్రిని కలువనున్నారని కూడా ఆ లేఖలో జయలలిత తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన ప్రధానమంత్రి 20 వ తేది కేంద్రమంత్రి నారాయణస్వామిని కూడన్ కుళం పంపారు. ఈ సందర్భంగా 'ప్రజల భద్రతే తమకు ప్రధానమని, ఆ తర్వాతే ఉత్పత్తి' అని కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేశారు. దీంతో 11 వ రోజైన 21 వ తేది నిరాహార దీక్షను ప్రజలు విరమించారు. 

No comments: